ఇదెక్కడి వార్త రా నాయనా!

 

  • ఇదెక్కడి వార్త రా నాయనా!
  • సీఎంను మంత్రులు సమర్థిస్తే తప్పా ?
  • అన్ని ప్రభుత్వాల్లోనూ ఇదే విధానం ఉంటుంది

వెలుగు పత్రిక ఆదివారం ఒక విచిత్రమైన వింతైన వార్త రాసింది. ఇది చదువుతుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాన్ని విమర్శించాలన్న గుల వల్ల వెలుగు పత్రికలో ఇలాంటి వింతలు జరుగుతున్నాయి. ఈ వార్త సారాంశం చదివే నవ్వు రాక మానదు. టీఆర్​ఎస్​లో కేసీఆర్ వారియర్స్​గా   కొత్త టీం తయారైందట! ఈ టీంలో బీసీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్​ ప్రధాన పాత్ర పోషిస్తున్నారట!

కేసీఆర్ పై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈ టీం పోరాటం చేస్తోందని, కేసీఆర్​పై ఈగ వాలినా ఊరుకోం అన్నట్టుగా వ్యవహరిస్తోందంటూ రాసుకుంటూ పోయింది. అపోజిషన్ పార్టీలు చేసే విమర్శలకు అధికార పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు బదులు ఇవ్వడం ప్రపంచంలో అన్ని చోట్లా జరిగేదే!  ఇందులో వెలుగు పత్రికకు తప్పేం కనిపించిందో తెలియాలంటే పేద్ద పరిశోధన చేయాలి కాబోలు! కేవలం బీసీ మంత్రులే కేసీఆర్​ను సమర్థిస్తున్నారట!! మిగతా వాళ్లు మౌనంగా ఉంటున్నారట! ఇదో గమ్మత్తైన విమర్శ! హరీశ్​ రావు,  వేముల ప్రశాంత్​ రెడ్డి, బాల్క సుమన్​ కూడా కేసీఆర్​పై విమర్శలకు స్పందిస్తున్నారు.

వీళ్లు బీసీలు కారు కదా!  విమర్శల్లో కులం కోణం వెతకడమే ఈ పత్రికే చెల్లింది.  కరోనా నియంత్రణ, సెక్రటేరియట్ కూల్చివేత, ఫాం హౌస్​లో సీఎం ఉండటం, కాళేశ్వరం కాలువలకు గండ్లు పడటం, ఉస్మానియా హాస్పిటల్ లో వర్షం నీరు చేరడం వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఎప్పటికప్పుడు తెరాస నాయకులు ధీటుగా స్పందించారు. విపక్షాల దిమ్మ దిరిగే కౌంటర్లు ఇచ్చారు. దీంతో వాళ్లంతా అన్నీ మూసుకొని కూర్చున్నారు. వెలుగు పత్రిక వార్తను గమనిస్తే ఇందులో బీసీ నాయకులను అవమానించే కుట్ర కనిపిస్తోంది. వాళ్లు కేసీఆర్​కు వ్యతిరేకంగా మారేలా ఈ పత్రిక రెచ్చగొడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే తెరాసకు బీసీలు పెద్ద అసెట్​. వారిని పార్టీకి దూరం చేయాలన్న దురాలోచన ఈ పత్రికది. బీజేపీ చెప్పినట్టు ఈ కత రాశారని స్పష్టంగా అర్థమవుతున్నది.