ఇలాంటి పిచ్చి పనులు చేయకండి

 

 

  • ఇలాంటి పిచ్చి పనులు చేయకండి
  • వేపచెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదనుకోవడం మూఢనమ్మకం
  • మూఢనమ్మకాల నుంచి బయటపడాలి

 

ఈరోజుల్లో పల్లెటూరి జనం కూడా స్మార్ట్​ఫోన్లు వాడుతారు. వాట్సప్​లు, ఫేస్​బుక్​లు వాడతారు. ఆన్​లైన్​ షాపింగ్​ చేస్తారు. అయినప్పటికీ మూఢనమ్మకాల నుంచి మాత్రం తెలంగాణ గ్రామీణ సమాజం ఇప్పటికీ బయటికి రావడం లేదు. కరోనాకు విరుగుడు అంటూ సోషల్​ మీడియా చెబుతున్న చిట్కా వైద్యాన్ని జనం  నమ్ముతున్నారు. ఇండియా వంటి దేశాల్లో కరోనాను అదుపు చేయడం చాలా కష్టంగా మారుతున్నది ఇందుకే. కొన్ని జిల్లాల్లో అయితే జనం పిచ్చిపిచ్చి పనులు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.

ఎవరు పుట్టించారో తెలియదు గానీ.. ఆదివారం సాయంత్రం నాటికి ఒక పుకారు ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం.. ఒక్క కొడుకు ఉన్న తల్లి బోర్ పంప్ ఉన్న ఐదు ఇళ్లల్లో నుంచి బిందెలో నీళ్లు సేకరించి వేప చెట్టుకు పోయాలి. తద్వారా ఆ తల్లికి పుణ్యం ప్రాప్తిస్తుంది. కరోనా రాదు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో ఈ పుకారు జోరుగా షికారు చేస్తోంది. ఇదంతా నిజమేనని నమ్మిన కొంతమంది తల్లులు.. బిందెలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. బోర్ ఉన్న ఇళ్ల గురించి ఆరా తీస్తూ నీళ్లు సేకరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తే.. జనాలు ఇలా ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి వీధుల వెంట తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

చదువుకున్నవాళ్లు సైతం ఇలాంటి పిచ్చి ప్రచారాలను నమ్మి పాటిస్తుండటం మరింత ఆందోళన కలిగించే విషాదం. ఆ రెండు జిల్లాల్లో.. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులున్న ఐదుగురు తల్లుల నుంచి చెంబెడు నీళ్లు తీసుకొచ్చి వేప చెట్టుకు పోయాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ నిజమేననుకుని నమ్ముతున్న తల్లులు.. వీధుల వెంట తిరుగుతూ నీళ్లు సేకరించే పనిలో పడ్డారు. కరోనా సోకుతుందన్న భయం కంటే.. ఆ పుణ్య కార్యమేదో చేయకపోతే పాపం చుట్టుకుంటుందన్న మూఢనమ్మకం వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం ఇలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి. పరిశుభ్రతగా ఉండటం. ఏకాంత వాసానికి పరిమితం కావడం, ఏవైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్​ దగ్గరికి వెళ్తే చాలు. వేపచెట్లు, నీళ్లు పోయడాలు.. మనల్ని రక్షించవన్న విషయాన్ని డాక్టర్లు ప్రచారం చేయాలి.