పంట పొలాలకు పండగ

 

  • పంట పొలాలకు పండగ
  • తెలంగాణ భూములకు జలాభిషేకం
  • తొలిసారి ఒకే సీజన్‌లో 41 లక్షల ఎకరాలకు నీరు
  • శ్రీరాంసాగర్‌ చరిత్రలో 9.68 లక్షల ఎకరాలకు

 

అపర భగీరథుడు అన్న పేరును కేసీఆర్ సార్థకం చేసుకున్నారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించుకున్నారు. తెలంగాణ నీళ్ల దోపిడీని అడ్డుకుంటానన్న ప్రతిజ్ఞను నెరవేర్చారు. రైతులకు పెద్ద దిక్కుగా నిలిచారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి సాగునీరు అందిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జనం మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. ఇలాంటి సీఎం ఇంతకుముందెప్పుడూ లేడన్న రైతుల మాటలు అక్షర సత్యాలు. కేసీఆర్​ రెక్కల కష్టం వల్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఆకట్టుకునేలా, చదివించేలా ఉంది. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లో సీజన్‌ మొదట్లోనే నీటి ప్రవాహాలు మొదలు కావడం, కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నది.

ప్రస్తుతం ఈ రెండు బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను  అంచనా వేస్తే… ఈ విషయం అర్థమవుతున్నది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానా కాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖరీ్‌ఫలో గరిష్ఠంగా 23 లక్షల ఎకరాలకే నీటిని అందించారు. సాధారణంగా ప్రతీ ఏడాది నీటి లభ్యతను బట్టి 10-20 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ వచ్చారు. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లలో కలిపి కూడా 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చిన సందర్భం లేదు. అయితే ప్రస్తుతం ఒక్క ఖరీ్‌ఫలోనే 41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించడం అరుదైన అంశంగా చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే వాతావరణ పరిస్థితి కనిపిస్తున్నది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో మినహా.. మిగిలిన అన్ని ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ మొదటి, రెండవ దశ మొత్తం ఆయకట్టుకు గతంలో ఎప్పుడూ నీటిని సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఒక్క ఖరీ్‌ఫలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని  అందించడం ఇదే తొలిసారి కానుంది. అలాగే ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లోని మెజారిటీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని అందించడం కూడా ఇదే మొదటి సారి కానుంది.

పైగా  సీజన్‌ మొదట్లోనే నీటిని విడుదల చేయడం కూడా ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ మధ్య నిర్వహించిన రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ (శివమ్‌) సమావేశంలో ప్రస్తుత వానా కాలంలో సాగునీటిని సరఫరా చేసే ఆయకట్టుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలను అంచనా వేసి, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టును నిర్ణయించారు. గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్​ ప్రభుత్వాలు యథేచ్ఛగా తెలంగాణ జలాలను సీమాంధ్రకు పంపించాయి. కేసీఆర్​ ప్రభుత్వం ప్రతి చుక్కనూ ఒడిసిపడుతూ మన భూములను సశ్యశ్యామలం చేస్తోంది. ఇలాంటి రైతుబాంధవుడు మన రాష్ట్రాన్ని పాలించడం ప్రజల సుకృతం.