ఉస్మానియా పాపం ఎవరిది ?

 

  • ఉస్మానియా పాపం ఎవరిది ?
  • విపక్షాల వల్లే ఈ దుస్థితి
  • కొత్త బిల్డింగ్​ను అడ్డుకున్నది వాళ్లే
  • లేకపోతే అద్భుతమైన బిల్డింగ్​ వచ్చి ఉండేది…

 

ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లోపాలను వెతుకుతుంటాయి. విమర్శలు చేస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఇది సహజమే కానీ ప్రజల జీవితాలకే నష్టం చేసేలా తెలంగాణ ప్రతిపక్షాల వైఖరి ఉంటున్నది. ఇది అత్యంత ప్రమాదకరం. తాజాగా ఉస్మానియా దవాఖానలో జరిగిన ఘటనకు ఇందుకు నిదర్శనం. నిన్న హైదరాబాద్​లో కురిసిన వర్షాలకు ఆస్పత్రిలోకి విపరీతంగా నీరు వచ్చింది. పేషేంట్లు ఇబ్బందిపడ్డారు. యథావిదిగా విపక్షాలు గోల చేశాయి. కొన్ని వందల ఏళ్ల భవనం. ఏ క్షణంలో కూలిపోతుందో తెలియదు. ఇది నివాసానికి అనువు కానేకాదని నిపుణులు తేల్చిచెప్పారు. అందుకే ప్రభుత్వం కొత్తది కట్టాలని నిర్ణయించింది.

వద్దు.. వద్దు.. ఇదే బిల్డింగులను కంటిన్యూ చేయాలని ప్రతిపక్షాలు గోల చేశాయి. కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇంత పాత బిల్డింగుల్లోకి వర్షం నీరు రమ్మంటే రాదా ? వందల ఏళ్ల బిల్డింగులో ఉంటూ నీళ్లు వస్తున్నాయని ఏడిస్తే ఏం ఫాయిదా ? కేసీఆర్​ చెప్పినట్టు చేసి ఉంటే ఈ దుస్థితి రానేరాకపోయేది కదా!  చారిత్రకమైనదే కావచ్చు కానీ పాడుబడ్డ, శిథిల భవనంలో ఎలా ఉంటాం ? బంగారు కత్తి అని మెడ కోసుకుంటామా ? ఒక అవసరం కోసం కట్టిన భవనం పాతదైతే.. దాన్ని తీసేసి అదే అవసరం కోసం కొత్త భవనం కట్టుకోవడం కూడా చారిత్రక తప్పిదమేనా? ఉన్నవాటిని ఉన్నట్టు అట్లాగే ఉంచేసుకుంటూ పోతే… మహానగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు స్థలం ఎక్కడి నుంచి రావాలి? జనం ఎక్కడికి పోవాలి? పాత భవనాన్ని కూలిస్తే వారసత్వ కట్టడమంటారు. మూఢ నమ్మకాలంటారు. దాని కింద నిధి నిక్షేపాలున్నాయి, దోచుకునేందుకే కూలుస్తున్నారని నిందలు వేస్తారు.

పోనీ ఊరవతల కడదామంటే రియల్‌ వ్యాపారం కోసమే అక్కడ కడుతున్నారంటారు. ఏదీ చేయకుండా ఊరుకుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇది సీఎం వైఫల్యం అంటారు. అది ఉస్మానియా దవాఖాన అయినా.. రాష్ట్ర సచివాలయమైనా… ఏది చేద్దామన్నా కేసులు, వ్యాజ్యాలతో ముందరికాళ్లకు బంధాలు వేస్తుంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఎలా పని చేయాలి?  2015 జూలైలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చరిత్రాత్మక ఉస్మానియా దవాఖానను సందర్శించారు. దాదాపు నూటపది సంవత్సరాల క్రితం నిర్మించిన దవాఖాన పూర్తిగా శిథిలమై.. సాధారణ నిర్వహణకు సైతం ఉపయుక్తంగా లేని పరిస్థితిని గమనించారు. దవాఖానలోని 11 బ్లాకుల్లో 8 బ్లాకులు ఎందుకూ పనికిరాకుండాపోయినయి.

మరమ్మతులు కూడా చేయలేని దుస్థితిలో ఉన్న దవాఖానను కూల్చివేసి 24 అంతస్థుల చొప్పున అద్భుతమైన రెండు భారీ టవర్ల నిర్మాణంతో అత్యాధునిక హంగులతో ఉస్మానియాకు సరికొత్త రూపాన్నిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటించడమే ఆలస్యం..  విపక్ష నాయకులు ఒకరివెంట ఒకరు అనుచరగణాన్ని పోగేసుకొని ఉస్మానియాపై వాలిపోయారు. చారిత్రక నేపథ్యాన్ని వంకగా చూపుతూ భవనాన్ని కూల్చొద్దని ఆందోళనలు మొదలుపెట్టారు. మీడియా సమావేశాలు పెట్టారు. కోర్టుల్లో కేసులు.. అసెంబ్లీ సాక్షిగా ఆందోళనలు..  ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోవడానికి చెయ్యాల్సినన్ని పనులు చేశారు.  ఇప్పుడు కూడా సిగ్గులేకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ? అసలు వీళ్లు మనుషులే కాదు. మనుషులకు ఉండాల్సిన కనీస లక్షణాలు లేవు. ఇలాంటి విపక్ష నాయకులు ఉన్నందుకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది.