నేల నవ్వింది.. పొలం పులకించింది

 

 

  • నేల నవ్వింది.. పొలం పులకించింది
  • ఇందుకు అపర భగీరథుడి కష్టమే కారణం
  • కేసీఆర్​ లేకుంటే తెలంగాణ ఎడారి అయ్యేది

 

 

నీటి పారుదల ప్రాజెక్టుల వివరాలు

జిల్లాలు       :       31

భారీ ప్రాజెక్టులు

పూర్తయిన ప్రాజెక్టులు     :       10

ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు      :       19

మధ్య తరహా ప్రాజెక్టులు

పూర్తయిన ప్రాజెక్టులు     :       30

ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు      :       9

 

మనిషి పీల్చేందుకు గాలి ఎంత ముఖ్యమో పచ్చని నేలా అంతే ముఖ్యం. తగినంత నీటితో నేలతల్లి దాహార్తి తీరిస్తే పచ్చనిపంటలతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. లేకుంటే ప్రపంచమే అంతం అవుతుంది. భూమాతకు సమృద్ధిగా నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలి. ఇందుకు భాగా ఖర్చు చేయాలి. వీటన్నింటికీ రాజకీయ సంకల్పం ఉండాలి. ప్రజలకు నిజంగా మేలు జరగాలనే తపన ఉన్న నాయకుడి కావాలి. రైతుపక్షపాతి అయిన నేత రావాలి. తెలంగాణ ప్రజల కొద్దీ ఇలాంటి లక్షణాలు ఉన్న నాయకుడు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. అపరభగీరథుడిగా మారి నదుల్లోని నీటి పొలంలోకి తెచ్చాడు. ఆయనే కేసీఆర్​ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీరున్న చోట నాగరికత వెల్లివిరుస్తుందనేది చారిత్రక సత్యం. ఆ నీటిని మళ్లించి.. బీడు భూముల్లోకి పారిస్తేనే ఆ నాగరికత మనుగడ సాధిస్తుంది. మరి అపార జల వనరులున్న తెలంగాణ ఎడారిగా మారడానికి కారణం.. సమైక్య నిర్లక్ష్యం! కృష్ణమ్మకు ప్రకాశం బ్యారేజీ.. గోదారికి ధవళేశ్వరం బ్యారేజీలు మాత్రమే మజిలీలు అనే ఉద్దేశపూర్వక కుట్రలు!!   గోదారిని బీడు భూముల వైపు నడిపించి.. కృష్ణమ్మకు నిలకడ నేర్పించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైంది. అందుకే ఇప్పుడు కృష్ణా, గోదావరి బేసిన్లలో 24 గంటల పాటు భారీ ఆధునిక యంత్రాలతో సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు ఉన్న న్యాయమైన వాటా జలాలను రాష్ట్ర రైతాంగానికి అందుతున్నాయి.

తెలంగాణకు గోదావరి, కృష్ణ కీలకం..

గోదావరి, కృష్ణా నదీ బేసిన్లు తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరులను సమకూరుస్తాయి. ఈ రెండు నదీ బేసిన్ల 70% పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రంలో ప్రతీ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం ఒక లక్ష ఎకరాలకు, మొత్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీల సంపూర్ణ వినియోగంతో పాటు అదనపు, న్యాయమైన కృష్ణాజలాల వాటా కోసం అటు సుప్రీంకోర్టు, ఇటు బ్రిజేష్ ట్రిబ్యునల్-2 ముందు పోరాటం చేస్తున్నది. మరోవైపు గోదావరి జలాల్లో తెలంగాణకు సుమారు 954 టీఎంసీల న్యాయమైన వాటా ఉండగా.. అందులో 40 శాతాన్ని వాడుకునేందుకు కూడా సరైన ప్రాజెక్టులు లేవు. అందుకే సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్‌లా మారి గోదావరి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో అత్యధికంగా గోదావరి జలాలను బీడు భూములకు తరలించేలా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఉత్తర తెలంగాణలో 54 నియోజకవర్గాల్లో.. 4 అర్బన్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా 50 నియోజకవర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున.. 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కేసీఆర్​ నాయకత్వంలోని ప్రభుత్వం అనుక్షణం శ్రమిస్తున్నది.

సాగునీటికి భారీ కేటాయింపులు

తెలంగాణ ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో కోటి ఎకరాల మాగాణం లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 1. కృష్ణా, గోదావరి నదులపై కొనసాగుతున్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం. 2. తెలంగాణ ప్రయోజనాలే ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో అత్యధిక నదీజలాల వినియోగం. 3.  తెలంగాణకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టడం. గత ఆరున్నరేండ్లకు పైగా కాలంలో ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రణాళికను ఉధృతంగా అమలు చేయడంతో ఆ మేరకు ఫలితాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ కాకతీయతో గత ఏడాది రికార్డు స్థాయిలో చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం చివరి దశకు సిద్ధమవుతున్న మిషన్ కాకతీయలో మొదటి రెండు దశల్లోనే విప్లవాత్మక ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రూ.1.41 లక్షల కోట్ల వ్యయంతో 23 మేజర్, 13 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండగా.. అందులో ఇప్పటికే చాలా ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. పది ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి. ప్రతి ఏటా తెలంగాణ ప్రాజెక్టులకు రూ.3-5 వేల కోట్ల మధ్యనే దోబూచులాడే సమైక్య పాలకుల బడ్జెట్ కేటాయింపులు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతితై అన్నట్లుగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరంలో పది నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే గతంలోనే ఎన్నడూలేని కేటాయింపులు చేసింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కొలిక్కి వచ్చిన తర్వాత ఏకంగా రూ. 25 వేల కోట్ల కేటాయింపులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 17,193 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 2017 వరకూ రూ.12,388.32 కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేసింది. గత దశాబ్దకాలాన్ని పరిగణలోనికి తీసుకుంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై దాదాపు ఏ సంవత్సరం కూడా వ్యయం రూ. 5 వేల కోట్లకు మించలేదు. కానీ 2016-17 ఏడాదిలో ఇప్పటి వరకే ఏకంగా రూ. 17 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేయడమంటే.. అందునా అనేక అవరోధాలను ఎదుర్కొని నీటిపారుదల శాఖ ముందుకు సాగడం అరుదైన రికార్డు. దీనితో పాటు చారిత్రక చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు కూడా ప్రతి ఏటా రూ. 2వేల కోట్ల పైచిలుకుతో చరిత్రలో ఊహించనిరీతిలో కేటాయింపులు జరుపుతున్నది. ఈ క్రమంలో ఇప్పటివరకు చేపట్టిన మిషన్ కాకతీయ రెండు దశల కార్యక్రమం ద్వారా రూ. 5,653 కోట్లతో 17,058 చెరువుల పునరుద్ధరణ పనులు చేశారు. దీంతో భూగర్భజలాలు సరాసరి 10-15 మీటర్ల మేర పెరుగడం విశేషం.

కాళేశ్వరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు

ఒక్క ప్రాజెక్టుతో దాదాపు ఏడు (పాత) జిల్లాలను సస్యశ్యామలం చేసే సరికొత్త చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుతో సాధ్యం కానుంది. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత కాళేశ్వరం (మేడిగడ్డ) వద్ద భారీ బ్యారేజీ నిర్మాణంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. నదీ గర్భమే రిజర్వాయర్‌గా.. నదీ ప్రవాహ మార్గమే అలైన్‌మెంట్‌గా తీసుకొని కాళేశ్వరం నుంచి జలాలను తిరోగమన దిశలో గోదావరిలోనే ఎత్తిపోస్తూ ఎల్లంపల్లి వరకు తరలించడమనేది ఈ పథకం ప్రత్యేకత. ఇందుకుగాను మేడిగడ్డ తర్వాత ఎగువన అన్నారం, ఆ పై సుందిల్ల బ్యారేజీలు ఉంటాయి. ఇందుకు అనుగుణంగా పంపుహౌజ్‌లను కూడా ఏర్పాటు చేశారు. గోదావరి నది నుంచి రోజుకు రెండు టీఎంసీల జలాల్ని ఎల్లంపల్లి ఆపై మిడ్ మానేరుకు తరలించడం, అక్కడి నుంచి వరుస రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడం, ఆయకట్టుకు నీరందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. అంతేకాదు ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరద కాల్వలోకి జలాల్ని తరలించిన తర్వాత అవసరమైనపుడల్లా శ్రీరాంసాగర్ జలాశయాన్ని నింపేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని రూపొందించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు శ్రీరాంసాగర్ స్టేజ్-1, 2, నిజాంసాగర్, ఎస్సారెస్పీ వరద కాల్వ, సింగూరు ప్రాజెక్టుల కింద ఉన్న మరో 18,82,970 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించనున్నారు. అంటే ఒక్క ప్రాజెక్టుతో ఏకంగా 37,08,670 ఎకరాల ఆయకట్టుకు జీవం పోయడమనేది బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దీనితో పాటు హైదరాబాదుకు, సుమారు 1400 గ్రామాలకు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని కేటాయించారు. ఈ ప్రాజెక్టులకుతోడు తుపాకులగూడెం బ్యారేజీ, డిండి ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం,శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవనం,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలు రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేశాయి. ప్రపంచంలో ఏ ఒక్క పాలకుడు కూడా ఇంత స్వల్పకాలంలో ఇన్ని ప్రాజెక్టులు చేపట్టిన చరిత్ర లేదు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్​ ప్రజలకు గుర్తుండిపోతారు. ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.